కీర్తన.. 122. దావీదు యాత్ర కీర్తన. “మనం యెహోవా ఆలయానికి వెళ్దాం” అని ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ఇక్కడ యెరూషలేము ద్వారాల దగ్గర మనం నిలిచిఉన్నాము. కొత్త యెరూషలేము ఒకే ఐక్యపట్టణంగా మరల కట్టబడింది. దేవునికి చెందిన గోత్రాల వారు అక్కడికి వెళ్తారు. యెహోవా నామాన్ని స్తుతించుటకు ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వెళ్తారు. ప్రజలకు న్యాయం తీర్చడానికి, రాజులు వారి సింహాసనాలు వేసుకొనే స్థలం అది. దావీదు వంశపు రాజులు వారి సింహాసనాలు అక్కడే వేసుకొన్నారు. యెరూషలేములో శాంతి కోసం ప్రార్థించండి. “నిన్ను ప్రేమించే ప్రజలకు అక్కడ శాంతి లభిస్తుందని నేను ఆశిస్తున్నాను. నీ ప్రాంగణాలలో శాంతి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నీ మహాభవనాల్లో భద్రత ఉంటుందని నేను ఆశిస్తున్నాను.” నా పొరుగువారు, ఇతర ఇశ్రాయేలీయులు క్షేమంగాను, శాంతితోను ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. మన యెహోవా దేవుని ఆలయక్షేమం కోసం ఈ పట్టణానికి మంచి సంఘటనలు సంభవించాలని నేను ప్రార్థిస్తున్నాను.