కీర్తన.. 119. పవిత్ర జీవితాలు జీవించేవాళ్లు సంతోషంగా ఉంటారు. ఆ మనుష్యులు యెహోవా ఉపదేశాలను అనుసరిస్తారు. యెహోవా ఒడంబడికకు విధేయులయ్యే ప్రజలు సంతోషిస్తారు. వారు వారి హృదయపూర్తిగా యెహోవాకు విధేయులవుతారు. ఆ మనుష్యులు చెడ్డ పనులు చెయ్యరు. వారు యెహోవాకు విధేయులవుతారు. యెహోవా, నీవు మాకు నీ ఆజ్ఞలిచ్చావు. ఆ ఆజ్ఞలకు మేము పూర్తిగా విధేయులము కావాలని నీవు మాతో చెప్పావు. యెహోవా, నేను నీ ఆజ్ఞలకు ఎల్లప్పుడూ విధేయుడనౌతాను, అప్పుడు నేను నీ ఆజ్ఞలను ఎప్పుడు చదివినా సిగ్గుపడను. అప్పుడు నేను నీ న్యాయం, నీ మంచితనం గూర్చి చదిని నిన్ను నిజంగా ఘనపర్చగలుగుతాను. యెహోవా, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను. కనుక దయచేసి నన్ను విడిచిపెట్టకుము యువకుడు పవిత్ర జీవితం ఎలా జీవించగలడు? నీ ఆజ్ఞలను అనుసరించుట ద్వారానే. నేను నా హృదయపూర్తిగా దేవుని సేవించుటకు ప్రయత్నిస్తాను. దేవా, నీ ఆజ్ఞలకు విధేయుడనవుటకు నాకు సహాయం చేయుము. నీ ఉపదేశాలను నేను చాలా జాగ్రత్తగా ధ్యానం చేసి నా హృదయంలో భద్రపరచుకొంటాను. ఎందుకంటే, నేను నీకు విరోధంగా పాపం చేయను యెహోవా, నీకే స్తుతి. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము. జ్ఞానంగల నీ నిర్ణయాలను గూర్చి నేను మాట్లాడుతాను. ఒకడు గొప్ప ఐశ్వర్యంలో ఆనందించేలా నేను నీ ఆజ్ఞలు అనుసరించటంలో ఆనందిస్తాను. నీ నియమాలను నేను చర్చిస్తాను. నీ జీవిత విధానం నేను అనుసరిస్తాను. నీ న్యాయ చట్టాలలో నేను ఆనందిస్తాను. నీ మాటలు నేను మరచిపోను. నీ సేవకుడనైన నాకు మేలుగా నుండుము. తద్వారా నేను జీవించగలను. నేను నీ ఆజ్ఞలకు వీధేయుడను అవుతాను. యెహోవా, నా కళ్లు తెరువుము, అప్పుడు నేను నీ ఉపదేశములను అనుసరించి నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను గూర్చి చదువుతాను. ఈ దేశంలో నేను పరాయివాణ్ణి. యోహోవా, నీ ఉపదేశాలు నాకు దాచిపెట్టకుము. నేను ఎంతసేపూ నీ నిర్ణయాలను గూర్చి చదవాలని కోరుతున్నాను. యెహోవా, గర్వించే ప్రజలను నీవు గద్దిస్తావు. ఆ గర్విష్టులకు కీడులే సంభవిస్తాయి. నీ అజ్ఞలకు విధేయులవుటకు వారు నిరాకరిస్తారు. నన్ను సిగ్గుపడనియ్యకు, ఇబ్బంది పడనియ్యకు. నేను నీ ఒడంబడికకు విధేయుడనయ్యాను. నాయకులు కూడ నన్ను గూర్చి చెడు విషయాలు చెప్పారు. అయితే యెహోవా, నేను నీ సేవకుడను; మరియు నేను నీ న్యాయ చట్టాలు చదువుతాను. నీ ధర్మశాస్త్రమే నాకు శ్రేష్టమైన స్నేహితుడు. అది నాకు మంచి సలహా ఇస్తుంది. నేను త్వరలోనే చనిపోతాను. యెహోవా, నీ మాటలతో నన్ను ఉజ్జీవింప జేయుము. నా జీవితం గూర్చి నేను నీతో చెప్పాను. నీవు నాకు జవాబు ఇచ్చావు. ఇప్పుడు నాకు నీ న్యాయ చట్టాలు నేర్పించు. యెహోవా, నీ న్యాయ చట్టాలు గ్రహించుటకు నాకు సహాయం చేయుము. నీవు చేసిన ఆశ్చర్య కార్యాలను నన్ను ధ్యానం చేయనిమ్ము. నేను అలసిపోయి విచారంగా ఉన్నాను. ఆజ్ఞయిచ్చి నన్ను మరల బలపర్చుము. యెహోవా, నన్ను కపటంగా జీవించనియ్యకు, నీ ఉపదేశాలతో నన్ను నడిపించుము. యెహోవా, నేను నీకు నమ్మకంగా ఉండాలని కోరుకొన్నాను. జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను జాగ్రత్తగా చదువుతాను. యెహోవా, నేను నీ ఒడంబడికకు కట్టుబడతాను. నన్ను నిరాశ పరచవద్దు. నేను నీ ఆజ్ఞలవైపు పరుగెత్తి విధేయుడనవుతాను. యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను ఎంతో సంతోష పెడతాయి. యెహోవా, నీ న్యాయచట్టాలు నాకు నేర్పించుము. నేను ఎల్లప్పుడూ వాటికి విధేయుడనౌతాను. గ్రహించుటకు నాకు సహాయం చేయుము. నేను నీ ఉపదేశాలకు విధేయుడనవుతాను. నేను వాటికి పూర్తిగా విధేయుడనవుతాను. యెహోవా, నీ ఆజ్ఞల మార్గంలో నన్ను నడిపించు. నేను నీ ఆజ్ఞలను నిజంగా ప్రేమిస్తున్నాను. నేను ఏ విధంగా ధనికుడను కాగలనో అని తలచుటకు బదులు నీ ఒడంబడికను గూర్చి తలచుటకు నాకు సహాయం చేయుము. యెహోవా, ఆయోగ్యమైన విషయాలనుండి నా కళ్లను మరలించుము. నీ మార్గంలో జీవించుటకు నాకు సహాయం చేయుము. యెహోవా, నేను నీ సేవకుడను కనుక నీవు వాగ్దానం చేసిన వాటిని జరిగించుము. నిన్ను ఆరాధించే ప్రజలకు నీవు వాటిని వాగ్దానం చేశావు. యెహోవా, నేను భయపడుతున్న అవమానాన్ని తొలగించు. జ్ఞానం గల నీ నిర్ణయాలు మంచివి. చూడు, నీ ఆజ్ఞలను నేను ప్రేమిస్తున్నాను. నా యెడల మంచితనం చూపించి నన్ను బతుక నిమ్ము. యెహోవా, నీ నిజమైన ప్రేమ నాకు చూపించుము. నీవు వాగ్దానం చేసినట్టే నన్ను రక్షించుము. అప్పుడు నన్ను అవమానించే ప్రజలకు నా దగ్గర జవాబు ఉంటుంది. యెహోవా, నీవు చెప్పే విషయాలు నేను నిజంగా నమ్ముతాను. నీ సత్యమైన ఉపదేశాలను నన్ను ఎల్లప్పుడూ చెప్పనిమ్ము. యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాల మీద నేను ఆధారపడుతున్నాను. యెహోవా, నేను శాశ్వతంగా ఎప్పటికీ నీ ఉపదేశాలను అనుసరిస్తాను. అందుచేత నేను క్షేమంగా జీవిస్తాను. ఎందుకంటే, నీ న్యాయ చట్టాలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను గనుక. యెహోవా ఒడంబడికను గూర్చి నేను రాజులతో చర్చిస్తాను. వారి ఎదుట భయపడకుండా నేను మాట్లాడుతాను. యెహోవా, నీ ఆజ్ఞలను చదువటము నాకు ఆనందం. ఆ ఆజ్ఞలంటే నాకు ప్రేమ. యెహోవా, నేను నీ ఆజ్ఞలను గౌరవిస్తున్నాను. వాటిని నేను ప్రేమిస్తున్నాను. మరియు నేను వాటిని ధ్యానం చేస్తూ వాటిని గూర్చి మాట్లాడుతాను. యెహోవా, నాకు చేసిన నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకొనుము. ఆ వాగ్దానం నాకు ఆశనిస్తుంది. నేను శ్రమ పడుతున్నప్పుడు నీవు నన్ను ఆదరించావు నీ మాటలు నన్ను మరల బతికించాయి. నా కంటే తామే మంచివాళ్లు అనుకొన్న మనుష్యులు ఎడతెగక నన్ను అవమానించారు. కాని యెహోవా, నీ ఉపదేశాలను అనుసరించటం నేను మానుకోలేదు. జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటాను. యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాలు నన్ను ఆదరిస్తాయి. నీ ఉపదేశాలను అనుసరించటం మానివేసిన దుర్మార్గులను చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. నా మట్టుకైతే, నీ న్యాయ చట్టాలు నా ఇంటపాటల్లా ఉంటాయి. యెహోవా రాత్రివేళ నేను నీ నామం జ్ఞాపకం చేసుకొంటాను. నీ ఉపదేశాలను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నీ న్యాయ చట్టాన్ని నేను అనుసరిస్తాను. నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడను అవుతాను కనుక నాకు ఈలాగు జరుగుతుంది. యెహోవా, నీ ఆజ్ఞలకు విధేయుడనగుట నా విధి అని నేను తీర్మానించుకొన్నాను. యెహోవా, నేను పూర్తిగా నీమీద ఆధార పడుతున్నాను. నీ వాగ్దానం ప్రకారం నాకు దయచూపించుము. నేను నా జీవితాన్ని గూర్చి చాలా జాగ్రత్తగా ఆలోచించాను. మళ్లీ నీ ఒడంబడికను అనుసరించటానికే వచ్చాను. ఆలస్యం లేకుండా నీ ఆజ్ఞలకు విధేయత చూపాలని నేను త్వరగా మళ్లుకొన్నాను. దుర్మార్గులు కొందరు నన్ను చుట్టుముట్టారు. అయితే యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు. నీ మంచి నిర్ణయాల కోసం నీకు కృతజ్ఞత చెల్లించటానికి అర్ధరాత్రి వేళ నేను మేల్కొంటాను. నిన్ను ఆరాధించే ప్రతి మనిషికీ నేను స్నేహితుడను. నీ ఆజ్ఞలకు విధేయత చూపే ప్రతి మనిషికి నేను స్నేహితుడను. యెహోవా, నీ నిజమైన ప్రేమ భూమిని నింపుతుంది. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము. యెహోవా, నీ సేవకుడవైన నాకోసం నీవు మంచి వాటిని జరిగించావు. నీవు చేస్తానని వాగ్దానం చేసిన వాటినే సరిగా నీవు చేశావు. యెహోవా నేను జ్ఞానంగల నిర్ణయాలు చేయడానికి నాకు గ్రహింపును ప్రసాదించు. నేను నీ ఆజ్ఞలను నమ్ముకొంటున్నాను. నేను శ్రమపడక ముందు అనేక తప్పులు చేశాను. కాని ఇప్పుడు నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడనవుతున్నాను. దేవా, నీవు మంచివాడవు, నీవు మంచి వాటినే చేస్తావు. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము. నాకంటే తామే మంచి వాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి చెడ్డ అబద్ధాలు చెబుతారు. కాని యెహోవా, నేను నా హృదయపూర్తిగా నీ ఆజ్ఞలకు లోబడుతూ, అలాగే కొనసాగుతున్నాను. ఆ మనుష్యులు చాల తెలివితక్కువ వాళ్లు. నీ ఉపదేశాలు ధ్యానించటం నాకు ఆనందం. శ్రమపడటం నాకు మంచిది. నేను నీ న్యాయ చట్టాలు నేర్చుకొన్నాను. యెహోవా, నీ ఉపదేశాలు నాకు మంచివి. 1,000 వెండి, బంగారు నాణెముల కంటే నీ ఉపదేశాలు మంచివి. యెహోవా, నీవు నన్ను చేశావు, నీ చేతులతో నన్ను నిలబెడుతావు. నీ ఆదేశాలు నేర్చుకొని గ్రహించుటకు నాకు సహాయం చేయుము. యెహోవా, నీ అనుచరులు నన్ను చూచి సంతోషిస్తారు. నీవు చెప్పే విషయాలను నేను నమ్ముతాను. కనుక వారికి చాలా సంతోషం. యెహోవా, నీ నిర్ణయాలు న్యాయంగా ఉంటాయని నాకు తెలుసు. నీవు నన్ను శిక్షించటం నీకు సరియైనదే. ఇప్పుడు నిజమైన నీ ప్రేమతో నన్ను ఆదరించుము. నీ వాగ్దాన ప్రకారం నన్ను ఆదరించుము. యెహోవా, నన్ను ఆదరించి, నన్ను బతుకనిమ్ము. నీ ఉపదేశములలో నిజంగా నేను ఆనందిస్తాను. నాకంటే తామే మంచివాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి అబద్ధం చెప్పారు కనుక వారిని సిగ్గుపరచు. యెహోవా, నేను నీ ఆజ్ఞలను అద్యయనం చేస్తాను. నీ అనుచరులను తిరిగి నా దగ్గరకు రానిమ్ము. నీ ఒడంబడిక తెలిసిన మనుష్యులను తిరిగి నా దగ్గరకు రానిమ్ము. యెహోవా, నన్ను నీ ఆజ్ఞలకు పరిపూర్ణంగా విధేయుడను కానిమ్ము. అందుచేత నేను అవమానించబడను. నీవు నన్ను రక్షిస్తావని నిరీక్షిస్తూ నేను చనిపోబోతున్నాను. కాని యెహోవా, నీవు చెప్పే విషయాలు నేను నమ్ముతాను. నీవు వాగ్దానం చేసిన వాటికోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. కాని నా కళ్లు అలసిపోతున్నాయి. యెహోవా, నీవు నన్ను ఎప్పుడు ఆదరిస్తావు? నేను పొగలో ఎండిపోయిన ద్రాక్ష తొక్కలా ఉన్నప్పుడు కూడా నీ న్యాయ చట్టాలను నేను మరచిపోలేదు. నేను ఎంత కాలం జీవిస్తాను? యెహోవా, నన్ను హింసించే మనుష్యులకు ఎప్పుడు తీర్పు తీరుస్తావు? కొందరు గర్విష్ఠులు వారి అబద్ధాలతో నన్ను పొడిచారు. మరి అది నీ ఉపదేశాలకు విరుద్ధం. యెహోవా, మనుష్యులు నీ ఆజ్ఞలన్నింటిని నమ్మగలరు. అబద్దికులు నన్ను హింసిస్తారు. నాకు సహాయం చేయుము! ఆ అబద్ధీకులు నన్ను దాదాపుగా నాశనం చేశారు. నేను మాత్రం నీ ఆదేశాలను అనుసరించటం మానలేదు. యెహోవా, నిజమైన నీ ప్రేమ చూపించి నన్ను జీవించనిమ్ము. నీవు చెప్పే వాటిని నేను చేస్తాను. యెహోవా, నీ మాట శాశ్వతంగా కొనసాగుతుంది. నీ మాట పరలోకంలో శాశ్వతంగా కొనసాగుతుంది. నీవు ఎప్పటికీ నమ్మదగిన వాడవు. యెహోవా, భూమిని నీవు చేశావు, అది ఇంకా నిలిచి ఉంది. నీ ఆజ్ఞ మూలంగా, ఇంకా అన్నీ కొనసాగుతాయి. యెహోవా, అన్నీ నీ సేవకుల్లా నీ ఆజ్ఞకు లోబడుతాయి. నీ ఉపదేశాలు నాకు స్నేహితుల్లా ఉండకపోతే, నా శ్రమ నన్ను నాశనం చేసిఉండేది. యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను జీవింపజేస్తాయి కనుక నేను ఎన్నటికీ వాటిని మరచిపోను. యెహోవా, నేను నీ వాడను. నన్ను రక్షించుము. ఎందుకంటే, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు కష్టపడి ప్రయత్నిస్తాను. దుష్టులు నన్ను నాశనం చేయాలని ప్రయత్నించారు. అయితే నీ ఒడంబడిక నాకు తెలివినిచ్చింది. నీ ధర్మశాస్త్రానికి తప్ప ప్రతిదానికీ ఒక హద్దు ఉంది. నీ ధర్మశాస్త్రాన్ని నేనెంతగా ప్రేమిస్తానో! దినమంతా అదే నా ధ్యానం. నీ ఆజ్ఞ నన్ను నా శత్రువులకంటే జ్ఞానవంతునిగా చేస్తుంది. నా గురువులందరికంటే నాకు ఎక్కువ గ్రహింపు ఉన్నది. ఎందుకంటే నీ ఉపదేశాలే నా ధ్యానం కాబట్టి. ముసలివారి కంటే నేనెక్కువ అర్థం చేసుకొంటాను. కారణం ఏమిటంటే, నేను నీ శాసనాలను అనుసరిస్తాను. నీ వాక్కు ప్రకారం నడుచుకోటానికి ప్రతి చెడు మార్గంనుండి నేను తప్పించుకొంటాను. యెహోవా, నీవు నా ఉపాధ్యాయుడవు కనుక నేను నీ న్యాయ చట్టాలకు విధేయుడనవటం మానను. నీ మాటలు నా నోటికి తేనెకంటే మధురం. నీ ఉపదేశాలు నన్ను తెలివిగవాణ్ణి చేస్తాయి, అందుచేత తప్పుడు ఉపదేశాలు నాకు అసహ్యము. యెహోవా, నీ వాక్యాలు నా బాటను వెలిగించే దీపాల్లా ఉన్నాయి. నీ న్యాయ చట్టాలు మంచివి. నేను వాటికి విధేయుడనవుతానని వాగ్దానం చేస్తున్నాను. మరియు నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను. యెహోవా, నేను చాలాకాలం శ్రమ అనుభవించాను. దయచేసి ఆజ్ఞయిచ్చి, నన్ను మరల జీవించనిమ్ము! యెహోవా, నా స్తుతి అంగీకరించు. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము. నా జీవితం ఎల్లప్పుడూ ప్రమాదంలోనే ఉంది. కానీ యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచి పోలేదు. దుర్మార్గులు నన్ను ఉచ్చులో పట్టాలని ప్రయత్నించారు కానీ నేను నీ ఆజ్ఞలకు అవిధేయుడను కాలేదు. యెహోవా, శాశ్వతంగా నేను నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను. అది నన్ను ఎంతో సంతోషింపజేస్తుంది. నీ ఆజ్ఞలు అన్నిటికీ విధేయుడనగుటకు నేను ఎల్లప్పుడూ కష్టపడి ప్రయత్నిస్తాను. స్థిరమైన మనస్సు లేనివాళ్లంటే నాకు అసహ్యం. నేను నీ ఉపదేశాలను ప్రేమిస్తున్నాను. నన్ను దాచిపెట్టి, కాపాడుము. యెహోవా, నీవు చెప్పే ప్రతిదీ నేను నమ్ముతాను. యెహోవా, దుర్మార్గపు ప్రజలను నా దగ్గరకు రానీయకు. నేను మాత్రం నా దేవుని ఆజ్ఞలకు విధేయుడనవుతాను. యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నాకు చేయూత నిమ్ము. నేను జీవిస్తాను. నేను నిన్ను నమ్ముకొన్నాను, నన్ను నిరాశపరచకు. యెహోవా, నాకు సహాయం చేయుము. నేను రక్షించబడుతాను. నీ ఆజ్ఞలను నేను నిరంతరం అధ్యయనం చేస్తాను. యెహోవా, నీ ఆజ్ఞలను ఉల్లంఘించే ప్రతి మనిషినీ నీవు తిప్పికొడతావు. ఎందుకంచే ఆ మనుష్యులు నిన్ను అనుసరిస్తామని ఒడంబడిక చేసుకున్నప్పుడు అబద్ధం చెప్పారు. యెహోవా, భూమి మీద దుష్టులను నీవు చెత్తలా చూస్తావు. కనుక నేను శాశ్వతంగా నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాను. యెహోవా, నీవంటే నాకు భయం, నీ చట్టాలకు నేను భయపడి వాటిని గౌరవిస్తాను. యెహోవా, సరియైనవి, మంచివి నేను చేశాను. నన్ను బాధించాలని కోరేవారికి నన్ను అప్పగించవద్దు. నీవు నాకు సహాయం చేస్తావని ప్రమాణం చేయుము. యెహోవా, నేను నీ సేవకుడను, ఆ గర్విష్ఠులను నాకు హాని చేయనియ్యకుము. యెహోవా, నన్ను రక్షించుటకు నీవు మంచి ప్రమాణం చేశావు. కాని నన్ను రక్షిస్తావని నీ కోసం ఎదురు చూచి నా కళ్లు అలసిపోయాయి. నిజమైన నీ ప్రేమ నా మీద చూపించుము. నేను నీ సేవకుడను. నీ న్యాయ చట్టాలు నాకు నేర్చించుము. నేను నీ సేవకుడను నేను నీ ఒడంబడికను నేర్చుకొని, గ్రహించుటకు నాకు సహాయం చేయుము. యెహోవా, యిది నీవు ఏమైనా చేయాల్సిన సమయం. ప్రజలు నీ న్యాయ చట్టం ఉల్లంఘించారు. యెహోవా, నీ ఆజ్ఞలు మేలిమి బంగారంకంటె నాకు ఎక్కువ ఇష్టం. నీ ఆజ్ఞలన్నింటికీ నేను జాగ్రత్తగా విధేయుడనవుతాను. తప్పుడు బోధలు నాకు అసహ్యం. యెహోవా, నీ ఒడంబడిక అద్భుతం, అందుకే నేను దానిని అనుసరిస్తాను. ప్రజలు నీ మాట గ్రహించడం మొదలు పెట్టినప్పుడు అది వారికి సరైన జీవన విధానాన్ని చూపెట్టి దీపంలా ఉంటుంది. నీ మాట తెలివితక్కువ జనులను కూడా తెలివిగల వారినిగా చేస్తుంది. యెహోవా, నేను నిజంగా నీ ఆజ్ఞలు ధ్యానించాలని కోరుతున్నాను. నేను కష్టంగా ఊపిరి పీలుస్తూ, అసహనంగా కనిపెడ్తున్న మనిషిలా ఉన్నాను. దేవా, నావైపుకు తిరిగి, నా మీద దయ చూపించుము. నీ నామమును ప్రేమించే వారికి సరియై నవి ఏవో వాటిని చేయుము. యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నన్ను నడిపించుము. నాపై ఏ దుష్టత్వమూ అధికారం చేయనీయవద్దు. యెహోవా, నన్ను బాధించు ప్రజల నుండి నన్ను రక్షించుము. నేనేమో, నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను. యెహోవా, నీ సేవకుని అంగీకరించి నీ న్యాయచట్టాలు నేర్పించుము. ప్రజలు నీ ఉపదేశాలకు లోబడనందువల్ల నదిలా నా కన్నీళ్లు ప్రవహించేట్టు నేను ఏడ్చాను. యెహోవా, నీవు మంచివాడవు. నీ చట్టాలు న్యాయమైనవి. ఒడంబడికలో నీవు మాకు ఇచ్చిన న్యాయ చట్టాలు మంచివి. యెహోవా, మేము నీ న్యాయ చట్టాలపై నిజంగా నమ్మకముంచగలము. నా ఉత్సాహం నాలో కృంగిపోయినది. ఎందుకంటే, నా శత్రువులు నీ న్యాయ చట్టాలను మరచిపోయారు. యెహోవా, మేము నీ మాట నమ్మగలుగుటకు మాకు రుజువు ఉంది. అదంటే నాకు ప్రేమ. నేను యువకుడను ప్రజలు నన్ను గౌరవించరు. కానీ నేను నీ ఆజ్ఞలు మరచిపోను. యెహోవా, నీ మంచితనం శాశ్వతంగా ఉంటుంది. నీ ఉపదేశాలు నమ్మదగినవి. నాకు కష్టాలు, చిక్కులు కలిగాయి. కాని నీ ఆజ్ఞలు నాకు ఆనందకరము. నీ ఒడంబడిక శాశ్వతంగా మంచిది. నేను జీవించగలుగునట్లు నీ ఒడంబడికను గ్రహించుటకు నాకు సహాయం చేయుము. యెహోవా, నా హృదయపూర్తిగా నేను నీకు మొరపెడ్తున్నాను. నాకు జవాబు ఇమ్ము. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను. యెహోవా, నేను నీకు మొరపెట్టుతున్నాను నన్ను రక్షించుము. నేను నీ ఒడంబడికకు విధేయుడనవుతాను. యెహోవా, నిన్ను ప్రార్థించుటకు నేను వేకువనే మేల్కొన్నాను. నీ మాటకోసం నేను వేచియుంటాను. నీవు చెప్పేవాటియందు నేను నమ్మకముంచుతాను. నీ వాక్యాన్ని ధ్యానించుటకు నేను చాలా రాత్రివరకు మెళకువగా ఉన్నాను. నీవు దయతో నా మాట విను. యెహోవా, నీ న్యాయ శాస్త్రాను సారముగా నన్ను జీవింప నిమ్ము. మనుష్యులు నాకు విరోధంగా కీడు పథకాలు వేస్తున్నారు. యెహోవా, ఆ మనుష్యులు నీ ఉపదేశాలను అనుసరించరు. యెహోవా, నీవు నాకు సన్నిహి తంగా ఉన్నావు. నీ ఆజ్ఞలు అన్నీ నమ్మదగినవి. నీ ఉపదేశాలు శాశ్వతంగా కొనసాగుతాయని చాలా కాలం క్రిందట నీ ఒడంబడిక నుండి నేను నేర్చుకొన్నాను. యెహోవా, నా శ్రమను చూచి, నన్ను తప్పించుము. నీ ఉపదేశాలను నేను మరువలేదు. యెహోవా, నాకోసం నా పోరాటం నీవు పోరాడి, నన్ను రక్షించుము. నీ వాగ్దానం ప్రకారం నన్ను జీవించనిమ్ము. దుష్టులు జయించరు ఎందుకంటే, వారు నీ న్యాయ చట్టాలను అనుసరించరు. యెహోవా, నీవు చాలా దయగలవాడవు. నీవు చెప్పే సరియైన వాటిని చేసి, నన్ను జీవించ నిమ్ము నన్ను బాధించుటకు ప్రయత్నిస్తున్న శత్రువులు నాకు చాలామంది ఉన్నారు. కాని నేను మాత్రం నీ ఒడంబడికను అనుసరించటం ఆపివేయలేదు. ఆ ద్రోహులను నేను చూస్తున్నాను. ఎందుకంటే యెహోవా, వారు నీ మాటకు విధేయులు కారు. చూడు, నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను. యెహోవా, నీ ప్రేమ అంతటితో నన్ను జీవించనిమ్ము. యెహోవా, ఆది నుండి నీ మాటలు అన్నీ నమ్మదగినవి. నీ మంచి ధర్మశాస్త్రం శాశ్వతంగా నిలుస్తుంది. ఏ కారణం లేకుండానే బలమైన నాయకులు నా మీద దాడి చేశారు. కానీ నేను మాత్రం నీ ధర్మశాస్త్రానికే భయపడి, దాన్ని గౌరవిస్తాను. యెహోవా, అప్పుడే ఐశ్వర్యపు నిధి దొరకిన వానికి ఎంత సంతోషమో, నీ వాక్యం నన్ను అంత సంతోష పరుస్తుంది. అబద్ధాలంటే నాకు అసహ్యం! నేను వాటిని తృణీకరిస్తాను. యెహోవా, నీ ఉపదేశాలు నాకు ఇష్టం. నీ మంచి న్యాయ చట్టాలను బట్టి నేను రోజుకు ఏడుసార్లు నిన్ను స్తుతిస్తాను. నీ ఉపదేశాలను ప్రేమించే మనుష్యులకు నిజమైన శాంతి లభిస్తుంది. ఆ మనుష్యులను ఏదీ పడగొట్టలేదు. యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కనిపెడ్తున్నాను. నేను నీ ఆజ్ఞలకు విధేయుడనయ్యాను. నేను నీ ఒడంబడికను అనుసరించాను. యెహోవా, నీ న్యాయ చట్టాలు అంటే నాకు ఎంతో ప్రేమ. నీ ఒడంబడికకు, నీ ఆజ్ఞలకు నేను విధేయుడనయ్యాను. యెహోవా, నేను చేసింది ప్రతిది నీకు తెలుసు. యెహోవా, నా సంతోష గీతం ఆలకించుము. నీ వాగ్దాన ప్రకారం నన్ను జ్ఞానం గలవానిగా చేయుము. యెహోవా, నా ప్రార్థన వినుము. నీవు వాగ్దానం చేసినట్టే, నన్ను రక్షించుము. నీవు నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించావు కనుక నేను స్తుతి గీతాలతో ఉప్పొంగి పోతాను. నీ మాటలకు నన్ను జవాబు చెప్పనిమ్ము. నా పాట నన్ను పాడనిమ్ము. యెహోవా, నీ న్యాయచట్టాలన్నీ మంచివి. నేను నీ ఆజ్ఞలను అనుసరించాలని నిర్ణయించు కొన్నాను గనుక నన్ను ఆదుకొని, నాకు సహాయం చేయుము. యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కోరుతున్నాను. కానీ నీ ఉపదేశాలు నన్ను సంతోష పరుస్తాయి. యెహోవా, నన్ను జీవించనిమ్ము నిన్ను స్తుతించనిమ్ము. నీ న్యాయ చట్టాలు నాకు సహాయం చేయనిమ్ము. నేను తప్పిపోయిన గొర్రెలా తిరిగాను. యెహోవా, నా కోసం వేదకుతూ రమ్ము. నేను నీ సేవకుడను. మరియు నేను నీ ఆజ్ఞలను మరువలేదు.